Translate

Friday, 2 December 2016

శివుడు ఎందుకు శ్మశాన వాసి అయ్యాడు?

శివం అంటే కాల్యాణం, శుభం అని అర్థం. శుభాన్ని కలిగించే వాడు శివుడు.
”అరిష్టం శివోతి తనూకరోతి” అంటే అరిష్టాలను తగ్గించేది శివం అని అర్థం”.




శివుడు నిర్గుణుడు. లయకారుడు. నిరాడంబరుడు. విలక్షణమైన వ్యక్తిత్వం, వేషధారణ, వేదాంతతత్త్వం ఉన్నవాడు. సహజంగా అందరూ అందంగా కనిపించాలనుకుంటారు, కాని అందుకు భిన్నంగా శివుడు స్వయంగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, ఎవ్వరూ ధరించలేని, చూడటానికి భీతిని కలిగించే అలంకారాలతో సాక్షాత్కరిస్తాడు. అందువల్లే శివతత్త్వం అనేది స్థిరపడింది.





అందరూ పట్టువస్త్రాలు ధరిస్తే శివుడు దిక్కులు అనే వస్త్రాలను ధరించి, దిగంబరుడయ్యాడు. అందరూ బంగారు మేడలలో నివసిస్తుంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడు. అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికేనని తెలియచెప్పడానికే ఆయన శ్మశాన వాసి అయ్యాడు. శివుడు లయకారుడు అంటే అన్నింటినీ లయం చేసేవాడు.





అయితే ఆయన లయం చేసేది మనుషులలో దాగి ఉన్న చెడు, పాపం, అజ్ఞానం, కోరికలు, బంధాలు, శారీరక, మానసిక దోషాలు, దుష్కర్మలు, ఇంద్రియాలు, భౌతికాలను, మంచి చెడుల విచక్షణ పోయినప్పుడు శివుడు ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు. అప్పుడే నూతన సృష్టి జరుగుతుంది.





అత్యంత రహితమైన లింగతత్త్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది. ఆ లింగ స్వరూపుడే శివుడు, జీవుడు. అందువల్ల శరీరంనుడి ఆత్మ లేక జీవుడు, శివుడు వేరుకాగానే, వెళ్ళి పోగానే శుభప్రదమైన దేహం ‘శివము’ నుండి అమంగళకరమైన ‘శవము’గా మారిపోతుంది.

అనంత నిరాకర పరబ్రహ్మ చిహ్నం లింగం. దేహం మీద మమకారం ఎంత పెంచుకున్నా, చివరికి మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అణువణువునా ఒంటపట్టించు కోవాలన్న ఉపదేశాన్ని అందిస్తుంది. పరమేశ్వరుని శరీరం మీద బూడిద, త్రిపుండ్రం. అంతిమయాత్రలో మనకి తోడెవ్వరూ ఉండరు. తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వడానికే శివుడు శ్మశానాలలో సంచరి స్తూండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాసభూములనిపేరు.





బూడిదనే విభూది. మానవులకు చావు పుట్టుకలు అనివార్యమని భగవద్గీత బోధిస్తుంది. మరణించిన వ్యక్తి చివరకు బూడిదగా మారి, పంచభూతాలలో కలిసిపోతాడు. శివుడి శరీరంమీద ఉండే బూడిద, లౌకిక సుఖాలనుంచి దూరంగా ఉండి, ఆధ్యాత్మికత దిశగా మనను మళ్లించాలని చెబుతుంది.





దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యేవేళ, ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకూ వస్తారు. ఆ తర్వాత, వెంట ఎవరూ రారు. కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు.



కాలుతున్న ఆ కాష్టం దగ్గర పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారేవరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి … ఆ పరమేశ్వరుడు ఒక్కడే.



సాధారణంగా శివాలయ దర్శనం చేస్తుంటాము, శివాలయానికి వెళ్ళినప్పుడు నిర్మలమైన మనస్సుతో, ఏమి ఆలోచించకుండా కొద్దిసేపు కళ్లు మూసుకుని, ధ్యానంలో కూర్చుంటే మానసిక ప్రశాతంత తప్పకుండా లభిస్తుంది. మనస్సు బాగా ఆందోళనగా ఉన్న సమయంలో ఒక్కసారి శివాలయానికి వెళ్ళి కూర్చుని రండి. మీకే ఆ తేడా తెలుస్తుంది. అందువల్ల శివాలయం కూడా స్మనాశం వంటిది అన్నారు.





No comments:

Post a Comment