లక్ష్మీదేవి
కోసం భూలోకంలో వెతికివెతికి వేసారిన శ్రీనివాసుడు ఆకలితో అలమటిస్తూ
వేంకటాచల పర్వతాన్ని చేరుకున్నారు. పుష్కరిణికి దక్షిణం వైపు ఒడ్డునున్న
చింతచెట్టుకింద పుట్టలో చేరి ఆకలితో అలమటిస్తున్నాడు. స్వామివారి ఆకలిని
తీర్చేందుకు శివుడు, బ్రహ్మ … లక్ష్మీదేవిని వేడుకుంటారు. బ్రహ్మ గోవుగా,
శివుడు దూడగా … లక్ష్మి గోపాలికగా అవతారం ఎత్తుతారు.
అసాధారణమైన
దేవతాంశ కలిగిన ఆవుదూడ అని చెప్పి చోళరాజు ఆస్థానానికి వెళ్ళి ఆవును
విక్రయిస్తుంది గోపాలిక. అడవికి మేతకు వెళ్ళిన ఆవు గొల్లవాని కన్నుగప్పి
పుట్టలో ధారగా పోసి పుట్టలో ఉన్న శ్రీనివాసుని ఆకలిని తీరుస్తుంది.
ప్రతిరోజూ ఈ విధంగానే పోసి ఏమీ ఎరగనట్టు గొల్లమందలో చేరి చోళరాజు గోశాలకు
చేరుకునేది. దేవతాంశ ఉట్టిపడే ఆ ఆవుపాలు రాజుగారిచే తాగించాలని
ఉవ్విళ్ళూరిన మహారాణి గొల్లవానిపై ఆగ్రహిస్తుంది, రాజుకు ఫిర్యాదు
చేస్తుంది. గొల్లవాడే ఆ పాలను తాగేస్తున్నాడని భ్రమించిన రాజు అతన్ని
దండిస్తాడు.
మరుసటిరోజు
అసలు గుట్టేమిటో రాబట్టాలన్న కృతనిశ్చయంతో గొల్లవాడు పశువులను
తోలుకెళతాడు. యథాప్రకారం కొండలు, గుట్టలు దాటుకుంటూ పుష్కరిణి సమీపంలో ఉన్న
పుట్టను ఎక్కి దాని బోరియలో పాలను ధారగా ఇస్తుంటుంది. అది చూసిన పశువుల
కాపరి మెల్లమెల్లగా, నక్కినక్కి ఆవు దగ్గరికి చేరతాడు. గొడ్డలిని
ఎత్తిపెట్టి ఒక్క వేటు వేస్తాడు. ఆవు బెదిరి పక్కకు తప్పుకుంటుంది. పుట్టలో
దాగివున్న శ్రీనివాసుడు గభాలున పైకి లేస్తాడు. గొడ్డలి వేటు ఆయనకు
తగులుతుంది, నుదుట గాయమవుతుంది.
నెత్తురు
చూసిన గొల్లవాడు “అయ్యో! ఎంతపని చేశాను … స్వామీ క్షమించు” అంటూ భీతిల్లి
శ్రీనివాసుని కళ్ళల్లోకి చూస్తూ మరణిస్తాడు. “ఈ భూలోకంలో తొలిగా నన్ను
దర్శించిన ఈ గొల్లవాని పూర్వజన్మ సుకృతం చాలా గొప్పది. కలియుగాంతం వరకూ
ప్రతిరోజూ మొట్టమొదట నన్ను దర్శించే మహాద్భాగ్యాన్ని ఈ గొల్లవాని సంతతికి
కల్పిస్తానని శ్రీనివాసుడు అతని మృతదేహం వద్ద ఉన్న సంతతికి వరమిస్తాడు.
ఈ నేపథ్యంలోనే ఈ ఆచారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఇప్పటికీ అమలులో ఉండటం విశేషం.
ఈ నేపథ్యంలోనే ఈ ఆచారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఇప్పటికీ అమలులో ఉండటం విశేషం.
No comments:
Post a Comment